Get Latest Business, Political, Bollywood, Cricket, videos, photos, live news
Email: aptsbreakingnews@gmail.com

హైడ్రా కు సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ సంపూర్ణ మద్దతు

రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన హైడ్రా వ్యవస్థకు సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ సంపూర్ణ మద్దతు పలికారు. ఎన్ కన్వెన్షన్ నిర్మాణాలను హైడ్రా కూల్చిన తర్వాత స్వయంగా అక్కడకు వెళ్ళి పరిశీలించిన నారాయణ సోమవారం మీడియాతో మాట్లాడారు. బీజేపీయేతర రాష్ట్రాలపై కేంద్ర ప్రభుత్వం సవతి తల్లి ప్రేమ చూపిస్తున్నదని, సహకార సమాఖ్య (ఫెడరల్) స్ఫూర్తిని దెబ్బ తీస్తున్నదని అయన అన్నారు. అదానీకి ‘సెబీ’ దాసోహమైందని, ఈ వ్యవహారంపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ (జేపీసీ) వేయాలని ఆయన డిమాండ్‌ చేశారు.

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి హైడ్రా అనే పులి మీద స్వారీ చేస్తున్నారని, దాని మీద నుంచి కిందికి దిగితే అది మింగేస్తుందని, అందుకే కిందికి దిగకుండా ఆ స్వారీని కంటిన్యూ చేయాలని విజ్ఞప్తి చేశారు. స్వయంగా ముఖ్యమంత్రే చెప్పుకున్నట్లుగా హైడ్రా విషయంలో రాజీ పడకుండా ముందుకే సాగాలని, సవాళ్ళను ఎదుర్కోవాలని కోరారు. విశాల ప్రయోజనాలను ఉద్దేశించి తీసుకున్న నిర్ణయం నుంచి వెనక్కు తగ్గొద్దని అయన సూచించారు. హైడ్రా ఏర్పాటు నిర్ణయం నగర ప్రజలందరికీ ఎంతో రిలీఫ్ ఇస్తున్నదని అన్నారు .

హైడ్రా ఏర్పాటుతో అక్రమంగా ఆక్రమణలు చేసిన రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు, సంపన్నులకు దడ పుడుతున్నదని, అక్రమ నిర్మాణాల కూల్చివేతలతో నిద్ర పట్టడంలేదన్నారు. వాటితో పాటు పేదలు నిర్మించుకున్న ఇండ్లను కూడా కూల్చివేయక తప్పదని, కానీ దానికి ముందే వారికి ప్రత్యామ్నాయ నివాస వసతిని చూపించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఎఫ్‌టీఎల్, బఫర్‌జోన్‌లలో, నాలాలపైన కొన్ని ప్రభుత్వ కార్యాలయాలు ఉన్నాయని, కానీ అవి ప్రజలకు సర్వీస్ చేస్తున్నాయని నారాయణ తెలిపారు .

హైదరాబాద్ సిటీలో చెరువులు, నాలాలు కబ్జాకు గురికావడంతో అది ప్రకృతి వైపరీత్యానికి దారితీస్తుందని, ఫలితంగా చిన్నపాటి వర్షానికే రోడ్లు జలమయం అవుతున్నాయని, వర్షపు నీరువెళ్ళడానికి మార్గాలే లేకుండా పోయాయన్నారు. కబ్జాదారులు ప్రభుత్వ భూములను కాజేసి ప్రైవేటు భవనాలు నిర్మించి వ్యాపారం చేసుకుంటూ లాభాలను గడిస్తున్నారని అన్నారు . చెరువుల, నాలాలను ఎవరు ఆక్రమించినా కూల్చివేయాలని అన్నారు. హైడ్రా విధివిధానాలపై  అన్ని పార్టీల ప్రతినిధులతో అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసి, అభిప్రాయాలను తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్‌కు నారాయణ సూచన చేశారు.

 

RSS
Follow by Email
Latest news