ఏపీలో కొత్త ప్రభుత్వం కొలువు తీరనుంది. ఈ నెల 12న ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. మంత్రివర్గం పై కసరత్తు చేస్తున్నారు. పవన్ కల్యాణ్, లోకేష్ కేబినెట్ లో ఉంటారనే ప్రచారం ఉన్నా..వ్యూహం మార్చినట్లు కనిపిస్తోంది. పవన్ కల్యాణ..లోకేష్ నిర్వహించనున్న పాత్ర పైన ఆసక్తి పెరుగుతోంది.
టీడీపీ, జనసేన, బీజేపీ నుంచి మంత్రులుగా ఎవరికి అవకాశం ఇవ్వాలనే అంశం పై ముఖ్యనేతలు ప్రాధమికంగా చర్చలు జరిపారు. మొత్తం 25 మంది కి మంత్రివర్గంలో అవకాశం ఉంది. టీడీపీ నుంచి చంద్రబాబుతో సహా 20 మంది మంత్రివర్గం ఉండనున్నారు. అలాగే జనసేన నుంచి ముగ్గురు, బీజేపీ నుంచి ఇద్దరికి మంత్రివర్గంలో అవకాశం ఇవ్వనున్నట్లు సమాచారం. అయితే, పవన్ కల్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా ఉంటారని ప్రచారంలో ఉన్నా , పవన్ మంత్రివర్గంలో చేరకూడదనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.
ఒక మంత్రిగా కంటే..పార్టీ అధినేతగానే ప్రభుత్వానికి సహకారం అందిస్తూ..ప్రజలకు ఇచ్చిన హామీల అమల్లో కీలకంగా వ్యవహరించాలనే ఆలోచనలో పవన్ కల్యాణ్ ఉన్నారని సమాచారం. అయితే, పవన్ తన తుది నిర్ణయం ఏంటనేది వెల్లడించాల్సి ఉంది. ఇక నారా లోకేష్ మంత్రిగా ఉంటారా లేదా అనే ప్రశ్నలు తలెతుతున్నాయి. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండటంతో.. లోకేష్ పార్టీ వ్యవహారాల పైనే ఎక్కువగా ఫోకస్ చేసే అవకాశం కనిపిస్తోంది.
గతంలో అధికారంలో ఉన్న సమయంలో పార్టీ కేడర్ ను పట్టించుకోలేదనే విమర్శ ఉంది. ఇప్పుడు కేంద్రంలో, రాష్ట్రంలో చంద్రబాబు కీలక పాత్ర పోషిస్తుండటంతో పార్టీ కేడర్ కు లోకేష్ అందుబాటులో ఉంటూ..పార్టీ – ప్రభుత్వం మధ్య సమన్వయకర్తగా వ్యవహరించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇక మైనార్టీ కోటాలో ఫరూక్ కు మంత్రి పదవి ఖాయంగా కనిపిస్తోంది. స్పీకర్ విషయంలో మూడు పార్టీల నుంచి ఏకాభిప్రాయంతో నిర్ణయం తీసుకోవాలని చంద్రబాబు భావిస్తున్నట్లు సమాచారం.