లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సత్తా చాటారు. పోటీ చేసిన రెండు చోట్లా ఆయన విజయఢంకా మోగించారు. ఉత్తర్‌ప్రదేశ్‌లో హస్తం పార్టీ కంచుకోట అయిన ‘రాయ్‌బరేలీ నుంచి తన సమీప ప్రత్యర్థి, భాజపా నేత దినేశ్ ప్రతాప్ సింగ్‌పై 3.88 లక్షల ఓట్ల మెజారిటీ సాధించారు. అలాగే తన సిట్టింగ్ స్థానమైన కేరళలోని వయనాడ్‌లో వరుసగా రెండోసారి జయకేతనం ఎగురవేశారు. సీపీఐ అభ్యర్థి అనీ రాజాపై 3.64 లక్షల ఓట్ల ఆధిక్యం సాధించారు.
తాజా ఫలితాలతో రాయ్‌బరేలీ కాంగ్రెస్ కంచుకోటగా మరోసారి రుజువైంది. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ ఇక్కడినుంచి మూడుసార్లు గెలిచారు. అంతకుముందు ఆమె భర్త ఫిరోజ్‌గాంధీ రెండుసార్లు విజయం సాధించారు. ఇక 2004 నుంచి 2019 వరకు సోనియా గాంధీ ప్రాతినిధ్యం వహించారు. ఆమె రాజ్యసభకు వెళ్లడంతో.. చివరి క్షణంలో రాయ్‌బరేలీ నుంచి రాహుల్ గాంధీ పోటీ చేశారు. రాహుల్ పోటీచేసిన రెండు చోట్ల గెలుపొందారు. దీంతో ఆయన ఏ స్థానాన్ని వదులుకుంటారు అనే అంశం ఆసక్తిగా మారింది.