ఆంధ్రప్రదేశ్ లో జరిగిన 2024 అసెంబ్లీ ఎన్నికల్లో అధికార వైఎస్ఆర్ సీపీ ని తిరస్కరించారు ప్రజలు. ఈ ఎన్నికల ఫలితాల్లో ఆ పార్టీ ఊహించని రీతిలో ఓటమి పాలయింది. అధికారం నుండి కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కని రీతిలో ప్రజలు ఓడించారు. గత ఎన్నికల్లో టీడీపీని ఎలా చిత్తుగా ఓడించారో.. ప్రస్తుతం అంతకన్నా దారుణంగా వైసీపీ ని ఓడించారు. టీడీపీ నేతృత్వంలోని కూటమికి ప్రజలు పట్టం కట్టారు. ఏపీలో మొత్తం 175 స్థానాలకుగాను టీడీపీ కి 135, జనసేనకి 21, బీజేపీకి 8 స్థానాల్లో విజయం సాధించాయి. ఇక 175 స్థానాల్లో పోటీ చేసిన వైసీపీకి కేవలం 11 సీట్లు గెలిచింది. మొత్తంగా 175 స్థానాలకు గాను టీడీపీ కూటమి 164 సీట్లతో సూపర్ విక్టరీ నమోదు చేసింది.
అలాగే ఏపీలోని 25 పార్లమెంట్ స్థానాలకు గాను టీడీపీ కూటమి 21 స్థానాల్లో విజయకేతనం ఎగురవేసింది. ఇందులో 16 స్థానాల్లో టీడీపీ గెలవగా, 3 చోట్ల బీజేపీ , 2 చోట్ల జనసేన అభ్యర్థులు విజయం సాధించారు. ఇక అధికార వైసీపీ 4 స్థాల్లో మాత్రమే విజయం సాధించి పరాజయాన్ని మూటగట్టుకుంది.
వైసీపీ ఉమ్మడి 8 జిల్లాల్లో ఖాతా తెరవలేదు :
ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైన వైసీపీ, 8 ఉమ్మడి జిల్లాల్లో ఖాతా తెరవలేకపోయింది. ఆయా జిల్లాలను కూటమి పార్టీలు క్లీన్‌స్వీప్ చేశాయి. ఎందరో సీనియర్ మంత్రులు సైతం ఓటమిపాలైనారు. తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, శ్రీకాకుళం, విజయనగరం, అనంతపురం, గుంటూరు, నెల్లూరు జిల్లాల్లోని అన్ని నియోజకవర్గాల్లో ఆ పార్టీ ఒక్క చోట కూడా గెలవలేకపోవడం విశేషం.