స్టాక్‌మార్కెట్లలో మోదీ వేవ్ స్పష్టంగా కనిపిస్తోంది. 2019లో వచ్చిన 303 సీట్లకన్నా బీజేపీకి మరిన్ని ఎక్కువ సీట్లు వస్తాయనే అంచనాలు ఎగ్జిట్‌పోల్స్‌లో కనిపించడమే ఇందుకు కారణం. గత వారమంతా నష్టాల బాట పట్టిన మార్కెట్లు ఈరోజు లాభాల బాట పట్టాయి. సెన్సెక్స్ 2622 పాయింట్ల లాభంతో ఓపెన్ అయింది. అలాగే, నిఫ్టీ కూడా 600 పాయింట్ల లాభంతో ఓపెన్ అయి, 23వేల పాయింట్లను దాటేసింది. కొనుగోళ్ల జోరు అలాగే కనిపిస్తోంది.
ఇక స్టాక్ మార్కెట్లలో అదానీ గ్రూప్ స్టాక్స్ ఇందులో ముందువరుసలో నిలిచాయి. ఈ ఉదయం ట్రేడింగ్‌లో అదానీ షేర్లు 16 శాతం పెరిగాయి. అంటే అదానీ గ్రూప్‌నకు చెందిన 10 లిస్టెడ్ కంపెనీల షేర్లలో ఇన్వెస్ట్ చేసినవారు లక్షా 40వేల రూపాయల విలువైన లాభాలు గడించారు. మోదీ సర్కార్ ధమాకా సీట్లతో హ్యాట్రిక్ కొడుతుందనీ ఎగ్జిట్‌పోల్స్ చెప్పడంతో ఇవాళ మార్కెట్లు పరుగులు పెడతాయని ముందే ఊహించారు. కానీ ఏ రేంజ్‌లో పెరుగుతాయని ఎవరూ అంచనా వేయలేకపోయారు. ఎగ్జిట్‌పోల్స్ అంచనాలను నిజం చేస్తూ, ఎన్నికల ఫలితాలు ఇలాగే ఉంటే, సెన్సెక్స్ 80వేలకు వెళుతుందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.