ప్రతిష్ఠాత్మకంగా జరిగిన ఎన్నికల్లో కీలక ఘట్టానికి సమయం ఆసన్నమైంది. రాజకీయంగా తీవ్ర ఉత్కంఠ రేపుతున్న పార్లమెంట్ ఎన్నికల ఫలితాల కౌంటింగ్‌కు ఇంకా కొన్ని గంటల సమయం మాత్రమే మిగిలి ఉంది. ఆ క్షణాల కోసం అభ్యర్థులతోపాటు ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఓట్ల లెక్కింపు సజావుగా జరిగేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. కౌంటింగ్ కేంద్రాలతోపాటు సమస్యాత్మక ప్రాంతాల్లో ఓట్ల లెక్కింపు సక్రమంగా జరిగేలా పోలీసులు పటిష్ఠ చర్యలు చేపట్టారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా రాష్ట్రవ్యాప్తంగా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. పోలింగ్ కేంద్రాల్లోకి అభ్యర్థులు, వారి అధీకృత లెక్కింపు ఏజెంట్లను మాత్రమే అనుమతిస్తారు.
ఇక మంగళవారం ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది. ఆ తరువాత ఉదయం 8.30 కి ఈవీఎంల కౌంటింగ్ ప్రారంభం అవుతుంది. తెలంగాణలోని 17 లోక్‌సభ స్థానాల్లో ఓట్ల లెక్కింపునకు ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు చేసింది. కౌంటింగ్ కేంద్రాల వద్ద 12 కేంద్ర బలగాలతో బందోబస్తు ఏర్పాటు చేశారు. కౌంటింగ్ హాల్ మొత్తం సీసీటీవీ మానిటరింగ్ ఉంటుంది. స్ట్రాంగ్ రూమ్ నుంచి కౌంటింగ్ హాల్ వరకు సీసీటీవీలో మానిటరింగ్ చేయనున్నారు. కౌంటింగ్ పూర్తి అయ్యాక ఈవీఎంలను స్టోరేజ్ రూమ్‌లలో పెడతామని.. భారీ బందోబస్తు ఉంటుందని ఈసీ వెల్లడించింది.
ఇక, ఏపీలో రాష్ట్ర వ్యాప్తంగా 33 ప్రాంతాల్లో 375 కౌంటింగ్ హాల్స్‌ను ఏర్పాటు చేశారు. అసెంబ్లీ, పార్లమెంట్ ఓట్ల లెక్కింపునకు 350 హాల్స్, పోస్టల్ బ్యాలెట్ లెక్కింపునకు 75 హాల్స్ ఏర్పాటు చేశారు. ఇవాళ అభ్యర్థుల సమక్షంలో ఆర్వో కార్యాలయాల్లోని అధికారులు స్ట్రాంగ్ రూములు తెరవనున్నారు. స్ట్రాంగ్ రూమ్‌లలోని పోస్టల్ బ్యాలెట్ బాక్స్‌లను కౌంటింగ్ కేంద్రాలకు అధికారులు తరలించనున్నారు