తెలంగాణలోకి కొత్త బ్రాండ్ మద్యం ఎంట్రీ అంటూ… ఇటీవల కొన్ని పత్రికల్లో వచ్చిన వార్తలపై ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు స్పందించారు. వాస్తవవాలను తెలుసుకోకుండానే కొన్ని పత్రికలు అసత్య వార్తలను ప్రచురించాయని మంత్రి అన్నారు. తెలంగాణలోకి సోమ్ డిస్టిలరీస్ కంపెనీకి చెందిన కొత్తరకం మద్యం వస్తోందని, విపక్షాలు విమర్శలు చేస్తున్న క్రమంలో మంగళవారం నాడు మంత్రి స్పందించారు.
బేవరేజెస్ కార్పోరేషన్ రోజువారీ కార్యకలాపాలు తన దృష్టికి రాలేదన్నారు. కానీ కొన్ని పత్రికలు వాస్తవాలు తెలుసుకోకుండా ప్రచురించాయని ఆవేదన వ్యక్తం చేశారు. డిమాండ్ – సప్లైని బట్టి కొత్త కంపెనీలకు బేవరేజెస్ కంపెనీ అనుమతులు ఇస్తుందని గుర్తించాలన్నారు. సోమ్ డిస్టిలరీస్ రెండు దశాబ్దాలుగా… 22 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో సరఫరా చేస్తోందని తెలిపారు. ఎక్కడా నిబంధనల ఉల్లంఘన జరగలేదని స్పష్టం చేశారు.
బీఆర్ఎస్ హయాంలోనూ కొత్త బ్రాండ్లకు అనుమతులు ఇచ్చారని గుర్తు చేశారు. బేవరేజెస్ కార్పోరేషన్ గతంలో ఎలాగైతే అనుమతులు ఇచ్చిందో… ఇప్పుడూ అవే నిబంధనల మేరకు ఇచ్చిందని తెలిపారు. మన దేశానికి చెందిన బేవరేజెస్ కంపెనీకి అనుమతులు ఇవ్వడంపై బీఆర్ఎస్ నేతలు దుష్ప్రచారం చేయడం విడ్డూరం అన్నారు.