బీజేపీ మూడోసారి అధికారంలోకి వస్తే రిజర్వేషన్లను రద్దు చేస్తుందన్న కాంగ్రెస్ నేతల వ్యాఖ్యలపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా మండిపడ్డారు. రిజర్వేషన్లు రద్దు చేసే ఉద్దేశ్యం బీజేపీకి లేదని స్పష్టం చేశారు. బుధవారం ఆయన చండీగఢ్‌లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ… అబద్దాన్ని గట్టిగా… పదేపదే చెప్పి ప్రజలను నమ్మించాలని కాంగ్రెస్ ప్రయత్నిస్తోందన్నారు. వారి కుట్రలను తాము ముందుకు సాగనిచ్చేది లేదన్నారు.
మోదీ మరోసారి గెలిస్తే రిజర్వేషన్లు రద్దు చేస్తారని అబద్ధపు ప్రచారం చేస్తున్నారని, పైగా తన ఫేక్ వీడియోను సర్క్యులేట్ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పదేళ్లుగా అధికారంలో ఉన్న మోదీ సర్కార్ ఏనాడూ రిజర్వేషన్ల తొలగింపు గురించి ప్రస్తావించలేదని గుర్తు చేశారు. రిజర్వేషన్లు తాము రద్దు చేయమనీ… చేయనీయమని పేర్కొన్నారు.
ఎన్నికల్లో ఇండియా కూటమి ఓడిపోవడం ఖాయమన్నారు. ఆ తర్వాత ఆ నిందని పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేపై వేస్తుందన్నారు. ఓడిపోయే కుటుంబం కోసం అసత్యాలు ప్రచారం చేయవద్దన్నారు. ప్రధాని మోదీ ఆర్టికల్ 370, ట్రిపుల్ తలాక్ రద్దు, బాలరాముడి మందిర నిర్మాణం, సీఏఏ అమలు చేశారన్నారు. అయిదేళ్లలో పలు రాష్ట్రాల్లో నక్సలిజం లేకుండా చేశామన్నారు.