ఏప్రిల్ 03 నుండి తెలంగాణ లో టెన్త్ పరీక్షలు మొదలుకాబోతున్నాయి. ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. ఈనెల 24 నుంచి ఆన్‌లైన్‌లో హాల్ టికెట్లు అందుబాటులో ఉంటాయని అధికారులు తెలిపారు. పదో తరగతి వార్షిక పరీక్షలను మరింత పకడ్బందీగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈక్రమంలోనే అన్ని పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాల ఏర్పాటుకు ఆదేశించింది. దీనికి సంబంధించిన ఏర్పాట్లపై ఆయా జిల్లాల అధికారులకు సర్క్యులర్ జారీ చేశారు.
పరీక్ష కేంద్రం ప్రైవేట్ స్కూళ్లో ఉన్నా సరే.. సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. కెమెరాల ఏర్పాటుకయ్యే వ్యయాన్ని ఆయా పాఠశాల యాజమాన్యాలే భరించాలని స్పష్టం చేసింది. టెన్త్ పరీక్షలకు 2,652 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశామని మంత్రి సబితాఇంద్రారెడ్డి తెలిపారు. కాగా, అన్ని పరీక్షలకు 3 గంటల సమయం ఇవ్వగా, సైన్స్ పరీక్షకు 3.20 గంటలు కేటాయించారు.