ఇంగ్లండ్ పర్యటనలో భాగంగా టీమిండియా మరో చిరస్మరణీయ విజయాన్ని నమోదు చేసింది. 3 మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో భాగంగా మంగళవారం తొలి వన్డేలో టీమిండియా రికార్డు విక్టరీ నమోదు చేసింది. ఫలితంగా 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. ఆతిథ్య జట్టు నిర్దేశించిన స్వల్ప లక్ష్యాన్ని వికెట్ నష్టపోకుండా (10 వికెట్ల తేడాతో) విజయాన్ని సొంతం చేసుకుంది.
టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్ చెత్త రికార్డును నమోదు చేసుకుంది. భారత ఫాస్ట్ బౌలర్లు జస్‌ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీలు బంతులతో నిప్పులు చెరిగారు. ఫలితంగా ఇంగ్లండ్ జట్టు 110 పరుగులకు ఆలౌట్ అయ్యింది. భారత్‌పై ఇంగ్లండ్‌కు అతి తక్కువ స్కోరు ఇదే. తొలుత బంతితో, ఆపై బ్యాటుతో చెలరేగిపోయిన టీమిండియా సిరీస్‌లో 1-0 ఆధిక్యాన్ని సాధించింది.
టీమిండియా కేవలం 18.4 ఓవర్లలోనే ఇంగ్లండ్ నిర్దేశించిన 110 లక్ష్యాన్ని రోహిత్ శర్మ సేన తుత్తునియలు చేసింది. కెప్టెన్ రోహిత్ శర్మ (58 బంతుల్లో 76 పరుగులు) చేసి అజేయంగా నిలిచాడు. రోహిత్‌కు జతగా వచ్చిన శిఖర్ ధావన్ (31) నిలకడగా రాణించి వికెట్ పడిపోకుండా జాగ్రత్తగా ఇన్నింగ్స్‌ను కాపాడాడు. రోహిత్ ధాటిగా ఆడుతుండగా…ధావన్ మాత్రం రొటేట్ చేస్తూ రోహిత్‌కు సహకారం అందించాడు. వీరిద్దరూ కలిసి 18.4 ఓవర్లలో 114 పరుగులు చేసి భారత్‌కు రికార్డు విజయాన్ని అందించారు.