తిరుమలలో భక్తుల సంఖ్య శనివారం సాయంత్రం అనూహ్యంగా పెరిగిపోయింది. సర్వ దర్శనం క్యూ కాంక్లెక్స్ నిండి బయట రెండు కీలో మీటర్ల మేరకు భక్తులు క్యూ కట్టారు. ఈ క్రమంలో సర్వ దర్శనానికి 20 గంటలు పట్టనున్నట్లు టీటీడీ అధికారులు తెలిపారు. వారాంతం కావడంతో శనివారం మధ్యాహ్నం నుంచే భక్తుల రాక ఒక్కసారిగా పెరిగిపోయిందని టీటీడీ ఈవో ధర్మారెడ్డి పేర్కొన్నారు.
అలాగే విద్యార్థులకు వేసవి సెలవులు ముగుస్తుండటంతో తిరుమలకు భక్తులు భారీగా తరలి వస్తున్నారని అయన అన్నారు. ఎంత మంది భక్తులు వచ్చినా…వారందరికీ స్వామి వారి దర్శనాన్ని కల్పించే దిశగా చర్యలు తీసుకుంటున్నామని ఈవో తెలిపారు. ఈ క్రమంలో భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆహారం, నీరు, పాలు అందిస్తున్నామని అన్నారు.