కరోనా వైరస్ ప్రారంభ దశలో, లాక్ డౌన్ సందర్బంగా తిరుమల కొండపై భజనలు నిర్వహించరాదని ఆంక్షలు విధించారు. ప్రస్తుతం రాష్ట్రంలో సాధారణ పరిస్థితులు నెలకొంటున్న క్రమంలో కొండపై భజనలు పునః ప్రారంభించాలని జానపద వృత్తి కళాకారుల సంఘం ఆధ్వర్యంలో అనేక పోరాటాలు చేపట్టారు. ఈక్రమంలో జానపద వృత్తి కళాకారుల సంఘం విజయం సాధించారు.
తిరుమల కొండపై అఖండ హరినామ సంకీర్తన యజ్ఞం జరిగే వేదికపై నిరంతరం భజనలు నిర్వహించడానికి టీటీడీ ఈవో ధర్మారెడ్డి అంగీకరించారని జానపద వృత్తి కళాకారుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఏ. జగన్మోహన్ రావు, ప్రధాన కార్యదర్శి బంగారు మురళి లు ఓ ప్రకటనలో తెలిపారు. టీటీడీ ఈవో ధర్మారెడ్డి కి శనివారం సాయంత్రం తిరుమలలోని ఈఓ కార్యాలయంలో తాము వినతిపత్రం సమర్పించినట్టు తెలిపారు. ఈ సందర్భంగా టీటీడీ ఈఓకు జానపద కళాకారులు ఎదుర్కొంటున్న పలు సమస్యలను వివరించామని తెలిపారు.
జానపద వృత్తి కళాకారుల సంఘం నాయకుడినని చెప్పుకుంటూ పులి మామిడి యాదగిరి అనే వ్యక్తి జానపద కళాకారులను మోసం చేస్తూ, డబ్బులు వసూలు చేస్తున్నాడని, దీనిపై తమ సంఘం విచారణ జరిపి యాదగిరిని బహిష్కరించడం జరిగిందని, తమ సంఘానికి యాదగిరి తో ఎలాంటి సంబంధం లేదని ఈఓకు తెలిపామన్నారు.
ఈ సందర్భంగా ఈఓ ధర్మారెడ్డి మాట్లాడుతూ కరోనా కారణంగా భజన సంకీర్తనలు ఆపామని, వాటిని పునః ప్రారంభించి నిరంతరాయంగా కొనసాగిస్తామని, దళారుల ప్రమేయం లేకుండా ఆన్లైన్ ద్వారా పారదర్శకంగా కేటాయింపులు చేపడతామని, ప్రతి కళాకారుడికి దేవుని సేవలో పాల్గొనడానికి అవకాశం ఇస్తామని, గతంలో ఉన్న ఏ సౌకర్యాన్ని తొలగించడం లేదని అన్ని రకాలుగా కళాకారులకు అండగా ఉంటామని టిటిడి ఈఓ ధర్మారెడ్డి నేతలకు హామీ ఇచ్చారు. ఈఓ ధర్మారెడ్డి సానుకూల స్పందనకు జానపద వృత్తి కళాకారుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బంగారపు మురళి ధన్యవాదాలు తెలిపారు.