తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, ఆయన తనయుడు, మంత్రి కేటీఆర్ లపై కేంద్రానికి ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ఫిర్యాదు చేశారు. గురువారం రాత్రి కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాతో అయన భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఏపీ, తెలంగాణ పరిస్థితులను అమిత్ షాకి వివరించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఏపీ తెలంగాణలోని పలు విషయాలపై అమిత్ షాతో చర్చించినట్టు పాల్ తెలిపారు. ఇటీవల తనపై జరిగిన దాడి వెనక తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, ఆయన తనయుడు, మంత్రి కేటీఆర్ ఉన్నారని ఆరోపించారు. తనపై ఎన్ని దాడులు జరిగినా తన పోరాటం ఆగదని అన్నారు. ప్రజాశాంతి పార్టీ భవిష్యత్‌లో రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ పోటీ చేస్తుందన్నారు.
ఇకపొతే, రెండు తెలుగు రాష్ట్రాలలో ఇరు ప్రభుత్వాలు రాష్ట్రాలను అప్పులపలు చేస్తున్నారని అయన ఆవేదన వ్యక్తం చేశారు. ఏపీ రూ. 8 లక్షల కోట్లు అప్పు చేస్తే, తెలంగాణ రూ. నాలుగున్నర లక్షల కోట్లు అప్పు చేసిందని వివరించారు. ఇలాగే అప్పులు చేసుకుంటూ పోతే త్వరలోనే దేశం మరో శ్రీలంక లాగా అవుతుందని హెచ్చరించారు. తెలంగాణలో జరుగుతున్న అవినీతి, అక్రమాలను తన జీవితంలోనే ఎన్నడూ చూడలేదన్నారు. తెలంగాణలో డీజీపీని కలిసేందుకు అపాయింట్‌మెంట్ అడిగితే ఇవ్వలేదని, కానీ అమిత్ షా అడగ్గానే ఇచ్చారని అన్నారు. ప్రధాని మోదీని కలవాలని షా సూచించారన్నారు.