- వచ్చే నెల 11 వరకూ రిజిస్ట్రేషన్ల కొనసాగింపు
పరీక్షల ఒత్తిడిని విద్యార్థులు ఎదుర్కోవడానికి, వారిలో భయం పోగొట్టడానికి ప్రధాని మోదీ ఏటా పాల్గొనే ‘పరీక్షా పే చర్చా’ 9వ విడత కార్యక్రమం జనవరిలో నిర్వహించనున్నారు. దీనికి సంబంధించిన రిజిస్ట్రేషన్లు వచ్చే నెల 11 వరకూ కొనసాగుతాయని కేంద్ర విద్యాశాఖ అధికారులు తాజాగా వెల్లడించారు. దేశ, విదేశాల్లోని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు పేర్లు నమోదు చేసుకోవచ్చు.
వీరికి ఆన్‌లైన్‌లో బహుళ ఐచ్ఛిక ప్రశ్నల ద్వారా పోటీ పరీక్ష పెడతారు. అందులో ఎంపికైన వారు పరీక్షల ఒత్తిడి గురించి ప్రధాని మోదీతో నేరుగా చర్చించవచ్చని అధికారులు పేర్కొన్నారు. ‘పరీక్షా పే చర్చా’ 8వ విడత కార్యక్రమం ఈ ఏడాది ఫిబ్రవరిలో ప్రసారమైంది. ప్రభుత్వ పాఠశాలలు, కేంద్రీయ, నవోదయ విద్యాలయాలు, సైనిక్, సీబీఎస్‌ఈ స్కూళ్లు, ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ బడులకు చెందిన మొత్తం 36 మంది విద్యార్థులు ఇందులో పాల్గొన్నారు.
అలాగే క్రీడలు, క్రమశిక్షణ, మానసిక ఆరోగ్యం, పోషకాహారం, సాంకేతికత, ఆర్థిక, సృజనాత్మకత, ఆశావాదం వంటి అంశాలపై ప్రముఖులతో నిర్వహించిన ఏడు ప్రత్యేక ఎపిసోడ్‌లూ ప్రసారమయ్యాయి. 245కు పైగా దేశాల నుంచి విద్యార్థులు, 153 దేశాల నుంచి ఉపాధ్యాయులు, 149 దేశాల నుంచి తల్లిదండ్రుల భాగస్వామ్యాన్ని ఆకర్షించి ‘2025 పరీక్షా పే చర్చా’ కార్యక్రమం గిన్నిస్ రికార్డు సాధించిన విషయం తెలిసిందే.











