ఇందిరమ్మ ఇళ్లలో లబ్ధిదారుల ప్రవేశాలకు రంగం సిద్ధమైంది. ఇందిరమ్మ ఇళ్ల పథకంలో భాగంగా గ్రేటర్ హైదరాబాద్ మినహా రాష్ట్రంలోని 32 జిల్లాల పరిధిలో 3.68 లక్షల ఇళ్లను హౌసింగ్‌శాఖ కేటాయించింది. గృహ ప్రవేశాలకు సిద్ధమవుతున్న లబ్ధిదారులకు రెండు రోజుల్లో రూ.55 కోట్లను హౌసింగ్ శాఖ వారి ఖాతాల్లో ప్రభుత్వం జమ చేసింది. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి ఇంతవరకు ప్రభుత్వం రూ.5,376 కోట్లను విడుదల చేసింది. ఫలితంగా మార్చి చివరి నాటికి 2.66 లక్షల ఇళ్లు గ్రౌండింగ్ అయ్యాయి. ఇందులో 17,800 ఇళ్ల నిర్మాణ పనులు పూర్తయ్యాయి. మొత్తం 3.24 లక్షల ఇళ్లకు అనుమతులు ఇచ్చింది.

ఇక పునాది దశలో 60,192, గోడల దశలో 34,388, శ్లాబ్ దశలో (చివరి నిర్మాణ దశ)లో 1,12,127 ఇళ్లు ఉన్నాయి. చివరి దశలో ఉన్న ఇళ్లను ఎంపిక చేసి లబ్ధిదారులు గృహప్రవేశాలు చేసేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఏప్రిల్, మే, జూన్ నెలల్లో మంచి రోజులను ఎంపిక చేసి ప్రవేశాలకు హౌసింగ్‌శాఖ తేదీలను ఖరారు చేసింది. 2026 ఏప్రిల్, మే, జూన్ నెలల్లో లక్ష మంది కొత్త ఇళ్లలోకి అడుగుపెట్టే విధంగా హౌసింగ్‌శాఖ ఏర్పాట్లు పూర్తిచేసింది.

అయితే , ఏప్రిల్‌లో 1, 20, 21, 30 తేదీలు, మే నెలలో 4, 8, 13, 14, 18, 25, 27, 28 తేదీలతోపాటు జూన్ మొదటి వారంలో లబ్ధిదారుల గృహ ప్రవేశాలకు ముహూర్తాలను ఖరారు చేసింది. ఏప్రిల్ 1న (బుధవారం) 4,100 మంది లబ్ధిదారులు తమ కొత్త ఇళ్లలోకి వెళ్లే విధంగా ఏర్పాట్లు చేసింది. రాష్ట్రంలో ఉగాది కంటే ముందు 9,676 మంది, పండగ రోజు మరో 900 మంది లబ్ధిదారులు కొత్త ఇళ్లలోకి అడుగు పెట్టారు.

ఏప్రిల్ చివరినాటికి మొత్తం 33 వేల మంది లబ్ధిదారులు కొత్తగా కట్టుకున్న ఇళ్లలోకి మారనున్నారు. గృహప్రవేశాలు చేసే లబ్ధిదారుల సంఖ్య మే నెల చివరినాటికి 60 వేలకు చేరుకునేలా ఏర్పాట్లు చేస్తున్నారు. మిగతా 40 వేల ఇళ్లకు జూన్‌లో ముహూర్తాలను నిర్ణయించారు. చివరి దశలో ఉన్న ఇళ్లకు ఐదో విడతకు సంబంధించిన రూ.లక్ష చొప్పున లబ్ధిదారులకు అందించడానికి హౌసింగ్‌శాఖ ఏర్పాట్లు చేస్తోంది.











