ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని శాశ్వతం చేస్తూ, చట్టబద్ధత కల్పించి భవిష్యత్తులో ఏ శక్తీ మార్చలేని విధంగా దిశగా కూటమి ప్రభుత్వం అడుగులు వేసింది. శనివారం ఉదయం 11 గంటలకు ప్రారంభమైన అమరావతి తీర్మానంపై చర్చ దాదాపు ఆరు గంటల పాటు ఉత్కంఠభరితంగా సాగింది. విభజన చట్టంలో అమరావతిని అంతర్భాగం చేయాలని కేంద్రాన్ని కోరుతూ సభ ఏకగ్రీవ తీర్మానం చేసింది.
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చర్చను ప్రారంభిస్తూ.. గత ప్రభుత్వ తీరుపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రపంచస్థాయి రాజధానిని నిర్మించాలనే సంకల్పంతో 34 వేల ఎకరాలను రైతులు స్వచ్ఛందంగా ఇచ్చారు. కేవలం రాజకీయ కక్షతో జగన్ మోహన్ రెడ్డి రాజధానిని స్మశానంగా మార్చారని బాబు ఆవేదన వ్యక్తం చేశారు. మూడు రాజధానుల ముసుగులో అమరావతి రైతులను రోడ్డున పడేసిన పాపం గత ప్రభుత్వానిదేనని ఆయన స్పష్టం చేశారు. ఇప్పుడు చేస్తున్న తీర్మానం అమరావతికి రక్షణ కవచంలా మారుతుందని భరోసా ఇచ్చారు.
ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తనదైన శైలిలో ఘాటుగా స్పందించారు. అమరావతి అనేది కేవలం ఒక కులానికో, ప్రాంతానికో చెందింది కాదు.. అది ఐదు కోట్ల ఆంధ్రుల ఆత్మగౌరవం అని అన్నారు. గత ప్రభుత్వం మూడు రాజధానుల పేరుతొ రాష్ట్ర భవిష్యత్తును పదేళ్లు వెనక్కి నెట్టేసిందని విమర్శించారు. అమరావతిని వెలుగుల జిలుగుల నగరంగా మార్చడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని చాటిచెప్పారు.
అమరావతిలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక గ్రాఫిక్స్ అంటూ అబద్ధ ప్రచారం చేశారని నారా లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పుడు అమరావతికి కేంద్రం నుంచి నిధులు రాబట్టడమే కాకుండా, చట్టబద్ధత కల్పించి ఏ శక్తీ అడ్డుకోలేని విధంగా అభివృద్ధి చేస్తామని లోకేష్ స్పష్టం చేశారు.
వైసీపీ హయాంలో అమరావతి రైతులపై దాడులు, అక్రమ కేసులు పెట్టారని అచ్చెన్నాయుడు గుర్తు చేశారు. బీజేపీ సభ్యుడు, మంత్రి సత్యకుమార్ యాదవ్ కేంద్ర ప్రభుత్వం అమరావతి అభివృద్ధికి కట్టుబడి ఉందని, విభజన చట్టం సవరణ ద్వారా దీనికి మరింత బలం వస్తుందని పేర్కొన్నారు. విష్ణుకుమార్ రాజు వంటి నేతలు కూడా జగన్ ప్రభుత్వం చేసిన రాజధాని ద్రోహం ను అంకెలు, సాక్ష్యాలతో సహా వివరించారు. ఈ చారిత్రక చర్చకు ప్రధాన ప్రతిపక్షం వైసీపీ హాజరుకాలేదు.











