మేయర్ పదవిని మజ్లిస్ పార్టీకి గిఫ్టుగా ఇవ్వడానికే జీహెచ్ఎంసీని మూడు ముక్కలుగా విభజించారని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు విమర్శించారు. సోమవారం రాత్రి హైదరాబాద్ అత్తాపూర్, ఉప్పర్‌పల్లికి చెందిన పలువురు యువకులు బీజేపీ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు. సీఎం రేవంత్‌రెడ్డి.. మజ్లిస్‌కు అనుకూలంగా జీహెచ్ఎంసీని ఏర్పాటు చేశారని అన్నారు.
రాజేంద్రనగర్ నియోజకవర్గంలో ఎంఐఎంను అడ్డుకొనే సత్తా బీజేపీకి మాత్రమే ఉందని అన్నారు. ఒకప్పుడు ఒకటి రెండు సీట్లకు పరిమితమైన కమలం పార్టీ ప్రస్తుతం 20 రాష్ట్రాల్లో అధికారంలోకి వచ్చిందన్నారు. భవిష్యత్తులో తెలంగాణలోనూ అధికారంలోకి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. పార్టీలో చేరిన యువకులకు కండువాలు కప్పి ఆహ్వానించారు. చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, రూరల్ జిల్లా అధ్యక్షుడు పి.రాజ్‌భూపాల్‌గౌడ్, టి.శ్రీనివాస్‌రెడ్డి, వై.శ్రీధర్, బి.బాల్‌రెడ్డి, ఎన్.మల్లారెడ్డి, ఎస్.విజయ్‌కుమార్, ఎస్.వెంకటేశ్ తదితరులు పాల్గొన్నారు.











