Get Latest Business, Political, Bollywood, Cricket, videos, photos, live news
Email: aptsbreakingnews@gmail.com

ఓడిపోతామనే భయంతో కాల్పులవిరమణ డ్రామా : ఇరాన్ సుప్రీం లీడర్

అమెరికా తమతో యుద్ధాన్ని కొనసాగించలేకనే కాల్పుల విరమణ ప్రకటించిందని భారత్‌లోని ఇరాన్ సుప్రీం లీడర్ ప్రతినిధి అబ్దుల్ మజీద్ హకీమ్ ఇలాహీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇలాగే యుద్ధం కొనసాగిస్తే మరిత నష్టాలపాలు కావలసి వస్తుందని ఈ నిర్ణయం తీసుకుందని అయన అన్నారు. ఇది అమెరికా స్వచ్ఛందంగా తీసుకున్న నిర్ణయం కాదని, గత్యంతరం లేని పరిస్థితుల్లోనే ఈ నిర్ణయానికి వచ్చిందని బుధవారం ఆయన స్పష్టం చేశారు.

అమెరికా “యుద్ధాన్ని కొనసాగించే శక్తి లేకపోవడంతో కాల్పుల విరమణ ప్రకటించాల్సి వచ్చింది. గత 41 రోజులుగా యుద్ధాన్ని ఆపాలని ఎంత ప్రయత్నించినా వారి వల్ల కాలేదు. చివరికి, ఓటమి తప్పదని గ్రహించి దాడుల విరమణకు ముందుకొచ్చారు” అని హకీమ్ ఇలాహీ తెలిపారు. శాశ్వత శాంతి నెలకొనాలంటే తమ షరతులను అమెరికా అంగీకరించాలని ఆయన స్పష్టం చేశారు.

తాము ఎప్పుడూ యుద్ధాన్ని కోరుకోలేదని, తమపై బలవంతంగా రుద్దారని ఇలాహీ అన్నారు.గల్ఫ్ ప్రాంతంలో ఉద్రిక్తతలకు వేల మైళ్ల దూరం నుంచి వచ్చిన అమెరికా జోక్యమే కారణమని, తాము పొరుగు దేశాలపై కాకుండా వారి భూభాగంలోని అమెరికా సైనిక స్థావరాలనే లక్ష్యంగా చేసుకున్నామని వివరించారు. ఈ ఘర్షణలో అమాయక ప్రజలు ఇబ్బంది పడటం తమకు ఇష్టం లేదని, ఎప్పుడూ అంతర్జాతీయ నిబంధనలు, మానవత్వాన్నే పాటించామని ఆయన వివరించారు.

అయితే, దాడులు కొనసాగితే గట్టిగా బదులిచ్చేందుకు తాము సిద్ధంగా ఉన్నామని అమెరికా గ్రహించిందని ఆయన పేర్కొన్నారు. ఇరాన్ అణ్వాయుధాలను అభివృద్ధి చేస్తోందన్న ఆరోపణలను ఆయన తీవ్రంగా ఖండించారు. “అది అబద్ధం. అణ్వాయుధాలు మా మత విశ్వాసాల ప్రకారం ‘హరాం’ (నిషిద్ధం) అని మా సుప్రీం లీడర్ స్పష్టంగా చెప్పారు. మాకు అవి ఎప్పటికీ వద్దని హకీమ్ ఇలాహీ తేల్చిచెప్పారు.

RSS
Follow by Email
Latest news