ఆంద్రప్రదేశ్ లో గృహావసర వంటగ్యాస్ సిలిండర్లను నల్లబజారుకు తరలిస్తున్న 146 ఏజెన్సీలపై 6ఎ కేసులు నమోదు చేశామని… 4,285 సిలిండర్లు స్వాధీనం చేసుకున్నామని రాష్ట్ర పౌరసరఫరాలశాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. విజయవాడలోని పౌరసరఫరాల కమిషనరేట్‌లో మంగళవారం సాయంత్రం ఆయన విలేకర్లతో మాట్లాడారు. వాణిజ్య వంటగ్యాస్ సిలిండర్ల పంపిణీని ప్రస్తుతం ఉన్న 40% నుంచి 70% పెంచినట్లు అయన వివరించారు. బుధవారం ఉదయం నుంచే హోటళ్లు, రెస్టారెంట్లు, ఆసుపత్రులకు సరఫరా ప్రారంభమవుతుందన్నారు. రాష్ట్రంలో వంటగ్యాస్, పెట్రోలు, డీజిల్ సరఫరా స్థిరంగా ఉందని అన్నారు.
రాష్ట్రంలో 16 గ్యాస్ ఏజెన్సీల పరిధిలో పంపిణీ సమస్యలు ఉన్నాయి. ఒక్కోచోట 40వేలకు పైగా కనెక్షన్లు ఉండటంతో జాప్యం జరుగుతోంది. అక్కడ డెలివరీకి 10 రోజులకు పైగా పడుతోంది. అయితే , ఈ సమస్యని అధిగమించేందుకు ఏజెన్సీల కు సహకారం అందించేలా చూడాలని ఇంధన సంస్థలకు సూచించామని మంత్రి తెలిపారు. సిలిండర్ రీబుకింగ్ వ్యవధి పట్టణాల్లో 25 రోజులు, గ్రామాల్లో 45 రోజులు ఉంది.
రాష్ట్రంలో గ్యాస్ ఏజెన్సీ లు ఓటీపీ ద్వారా సిలిండర్ డెలివరీ చేస్తున్నారు. ఎక్కడైనా సిలిండర్ ఇవ్వకుండా డెలివరీ చేసినట్లు మెస్సేజ్ వస్తే 1967 కాల్‌సెంటర్‌కు ఫిర్యాదు చేయాలని మంత్రి సూచించారు. ఖాళీసిలిండర్ తీసుకుని గ్యాస్ ఏజెన్సీల వద్దకు వెళ్లవద్దని అన్నారు. రోజుకు 2.79 లక్షల గృహావసర సిలిండర్లు డెలివరీ చేస్తున్నాం. సాధారణ రోజులతో పోలిస్తే సిలిండర్ల సరఫరా పెరిగిందని మంత్రి నాదెండ్ల వివరించారు.
దీపం లబ్దిదారులు పీ ఎన్ జీ కనెక్షన్ తీసుకుంటే రూ. 2,800 ప్రోత్సాహకం
పైప్డ్ నేచురల్ గ్యాస్ కనెక్షన్లను ప్రోత్సహించాలని సీఎం చంద్రబాబు నిర్ణయించారు. 10 లక్షల కనెక్షన్లు ఇస్తాం. రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న పైప్‌లైన్ నెట్వర్క్ ప్రకారం 2.70 లక్షల కొత్త కనెక్షన్లు ఇవ్వవచ్చునని ఆ దిశగా అధికారులు దృష్టి సారించాలని సీఎం సూచించారు. రాష్ట్రం లో గ్యాస్ కొరత లేదని పాలు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని బాబు అన్నారు.
ఇక ఇండియన్ ఆయిల్ సంస్థ గుంటూరు, కర్నూలు, ప్రకాశం, విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో పీఎన్ జీ ద్వారా గ్యాస్ కనెక్షన్ లను ఇస్తుంది. అలాగే కృష్ణా జిల్లాలో మేఘా సంస్థలు, విజయవాడ, కాకినాడల్లో భాగ్యనగర్ గ్యాస్ సంస్థ కనెక్షన్లు ఇస్తోంది. తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాల్లో గోదావరి గ్యాస్ కనెక్షన్ లు ఇస్తున్నాయి. చిత్తూరు, వైఎస్సార్ కడప, అనంతపురం, శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాల్లో థింక్ గ్యాస్ (ఏజీఅండ్‌పీ) కనెక్షన్లు ఇస్తున్నాయి.











