10-50 సంవత్సరాలలోపు వయసున్న మహిళలలను శబరిమల అయ్యప్ప ఆలయం ప్రవేశ నిషేధం అనే అంశంపై దుఖలైన పిటిషన్ పై 2018లో ఐదుగురు జడ్జీల సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం రద్దు చేసింది. ఈ తీర్పుపై పలు రివ్యూ పిటిషన్లు దాఖలు కాగా, సుప్రీంకోర్టు 9 మంది సభ్యులతో కూడిన ధర్మాసనం మంగళవారం నాడు విచారణ చేపట్టింది. కేరళలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఈ కేసు విచారణ ప్రాధాన్యతను సంతరించుకుంది.

సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలో 9 మంది సభ్యులతో కూడిన ఈ ధర్మాసనంలో జస్టిస్ బి.వి.నాగరత్న, జస్టిస్ ఎం.ఎం.సుందరేశ్, జస్టిస్ అహసానుద్దీన్ అమానుల్లా, జస్టిస్ అరవింద్ కుమార్, జస్టిస్ అగస్టీన్ జార్జ్ మసీహ్, జస్టిస్ ప్రసన్న బి వరాలే, జస్టిస్ ఆర్.మహదేవన్, జస్టిస్ జోయ్‌మల్యా బాగ్చి సభ్యులుగా ఉన్నారు. కేంద్రం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపించారు. మహిళల ప్రవేశంపై ఉన్న ఆంక్షలను కేంద్ర ప్రభుత్వం గట్టిగా సమర్థించింది.

అయితే , ‘ఒక్క శబరిమల ఆలయంలో మినహా…. దేశంలోని అయ్యప్ప స్వామి ఆలయాలు అన్నింటిలోనూ అన్ని వయసుల మహిళలకు ప్రవేశం ఉంది. ఇది ఒక విలక్షణమైన కేసు’ అని తుషార్ మెహతా తెలిపారు. ‘విశ్వాసం, ఆచరణకు సంబంధించిన అంశం. ఏది అవసరం, ఏది అవసరం లేదో తేల్చాలంటే మత గ్రంథాలను అవగాహన చేసుకోవాలి. సమీక్షించాలి. అది సక్రమంగా జరగాలంటే అంతటి ఆధ్యాత్మిక స్థాయిని కలిగి ఉండాలి’ అని అన్నారు. భారతీయ సంస్కృతిలో మహిళలకు అత్యున్నత స్థానాన్నే కల్పించారని చెప్పారు. పితృస్వామ్యం, ఫెమినిజం తదితర దిగుమతి చేసుకున్న సిద్ధాంతాల కోణంలో చూడవద్దని సూచించారు.











