ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం-2014ను సవరిస్తూ బుధవారం సభలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బిల్లుకు లోక్‌సభ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. గత పదేళ్లుగా నెలకొన్న అనిశ్చితికి తెరదించుతూ, జూన్ 2, 2024 నుండి ఈ సవరణ అమల్లోకి వచ్చేలా నిబంధనలు చేర్చారు. ఈ బిల్లు ద్వారా అమరావతిని ఆంధ్రప్రదేశ్ ఏకైక, శాశ్వత రాజధానిగా చట్టబద్ధత కల్పించారు. దాదాపు రెండు గంటల పాటు సాగిన ఈ చర్చలో కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్ బిల్లును ప్రవేశపెట్టగా, స్పీకర్ ఓం బిర్లా సమక్షంలో మూజువాణి ఓటుతో బిల్లు ఆమోదం పొందింది.
ఈ బిల్లుపై చర్చలో కాంగ్రెస్ పార్టీ మద్దతు ప్రకటించింది. కాంగ్రెస్ ఎంపీ మాణికం ఠాగూర్ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం అమరావతిని శాశ్వత రాజధానిగా తాము మనస్ఫూర్తిగా సమర్థిస్తున్నామని పేర్కొన్నారు. బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ నగరాల తరహాలో అమరావతిని అభివృద్ధి చేయాలని, అదే సమయంలో విశాఖపట్నం, తిరుపతి, కర్నూలు వంటి ప్రాంతాలను కూడా విస్మరించకూడదని సూచించారు. రాష్ట్ర విభజన సమయంలో ఇచ్చిన ప్రత్యేక హోదా వంటి హామీలను కూడా కేంద్రం నెరవేర్చాలని ఆయన డిమాండ్ చేశారు.
బీజేపీ ఎంపీ సీఎం రమేష్ , టీడీపి సభ్యులు ఈ బిల్లును చారిత్రాత్మకమైనదిగా అభివర్ణించారు. ఒక రాష్ట్ర రాజధానిని మార్చకుండా ఉండేందుకు పార్లమెంటులో చట్టం చేయడం దేశ చరిత్రలో ఇదే తొలిసారి అని వారు పేర్కొన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మాత్రం ఈ బిల్లును తీవ్రంగా వ్యతిరేకిస్తూ సభ నుండి వాకౌట్ చేసింది. పార్టీ ఎంపీ మిథున్ రెడ్డి అమరావతి పేరుతో గత ప్రభుత్వం ఇన్సైడర్ ట్రేడింగ్‌కు పాల్పడిందని ఆరోపించారు.
అమరావతికి కేటాయించిన రూ. 15,000 కోట్లు కేవలం అప్పుల రూపంలోనే ఉండటం వల్ల రాష్ట్రంపై ఆర్థిక భారం పెరుగుతుందని, భూములిచ్చిన రైతులకు కచ్చితమైన కాలపరిమితితో న్యాయం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ బిల్లు గురువారం రాజ్యసభ ముందుకు వెళ్తుంది. అక్కడ ఈ బిల్లు ఆమోదం పొందడం లాంఛనమే. అనంతరం రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ చేస్తారు.











