తమకు ఇంకా రుణమాఫీ కాలేదని రైతులు ఆందోళన చేస్తున్నారు . ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తం అయ్యింది. రూ.2 లక్షల కంటే ఎక్కువ రుణం ఉన్న రైతులకు మాఫీకి సంబంధించి త్వరలోనే ప్రత్యేక షెడ్యూలును సర్కార్ ప్రకటిస్తుందని వ్యవసాయశాఖ కార్యదర్శి రఘునందన్ రావు తెలిపారు. రుణమాఫీకి సంబంధించిన సమస్యల పరిష్కారానికి త్వరలోనే విధివిధానాలు జారీ చేస్తుందని అన్నారు .
అర్హత ఉండి, ఇంకా సొమ్ము జమ కాని రైతుల సమస్యల పరిష్కారం కోసం మండలాల్లో ప్రత్యేక నోడల్ అధికారులను నియమిస్తున్నట్టు అయన ప్రకటించారు . మంగళవారం నుంచి మండల వ్యవసాయాధికారి కార్యాలయాలతో పాటు రైతు వేదికల్లో ఫిర్యాదుల స్వీకరణ మొదలైందని అధికారులు తెలిపారు.
రైతులు తమ ఆధార్ కార్డులోని సమాచారం, బ్యాంకుల్లో నమోదైన డేటాలో చిన్న చిన్న తప్పులు, పట్టాదారు పాస్ పుస్తకాల సమస్యలు, పేరు సరిగా లేకపోవడం వంటి వాటి గురించి నోడల్ అధికారులకు ఫిర్యాదు చేయవచ్చునని రఘునందన్ రావు తెలిపారు.