- అమెరికాలో రెట్టింపైన బియ్యం ధరలు
- బాస్మతి బియ్యంపై కూడా నిషేధం విధించొచ్చన్న భయాలు
- భారత్ తన నిర్ణయాన్ని పునరాలోచించుకోవాలన్న ఐఎంఎఫ్
బియ్యం (నాన్ బాస్మతి) ఎగుమతులపై భారత్ నిషేధం విధించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో అమెరికాలో బియ్యం వ్యాపారుల పాలిట వరంగా మారింది. ఇప్పటికే బియ్యం కొనుక్కోవడానికి షాపుల ముందు జనాలు బారులుతీరి పోటీ పడి కొనుక్కుంటున్నారు. బియ్యంకి అకస్మాత్తుగా డిమాండ్ పెరిగింది. అమెరికా వ్యాపారులు కృత్రిమ కొరత సృష్టించి బియ్యం ధరలను రెట్టింపు చేశారని ఆరోపణలు వెల్లువెతుతున్నాయి. ఫలితంగా అమెరికా వ్యాపారులపై కాసుల వర్షం కురుస్తోంది.
భారత్ నిషేధం విధించిన నేపథ్యంలో బియ్యం కొనేందుకు జనాలు పోటీ పడి కొనుక్కుంటున్న వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారడంతో పెద్ద పెద్ద కంపెనీలన్నీ బియ్యం ధరలను రెట్టింపు చేశాయి. భవిష్యత్తులో ఇతర రకాల బియ్యంపై నిషేధం విధించొచ్చన్న అంచనాల నేపథ్యంలో అక్కడి రెస్టారెంట్ల యాజమాన్యాలు సైతం ఇప్పటి నుంచే బాస్మతి బియ్యం ను భారీగా నిల్వలు చేసుకునేందుకు కొనుగోళ్ల పెంచినట్టు సమాచారం.
ఉక్రెయిన్-రష్యా యుద్ధం కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఆహారధాన్యాల కొరత తీవ్రమవుతోంది. దీనికితోడు భారత్ నిర్ణయం పరిస్థితులను మరింత దిగజార్చే అవకాశం ఉందన్న ఆందోళన సర్వత్రా వ్యక్తమవుతోంది. భారత్ తన నిర్ణయాన్ని పునరాలోచించుకోవాలని అంతర్జాతీయ ద్రవ్య నిధి సూచించింది. ఆహార ధాన్యాల ధరలు పెరిగేగొద్దీ ఇతర దేశాలు రిటాలియేటరీ చర్యలకు దిగే ప్రమాదం ఉందని కూడా పేర్కొంది.