తెలంగాణ కుంభమేళాగా ప్రసిద్ధి చెందిన మేడారం సమ్మక్క-సారలమ్మ మహా జాతర అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. నాలుగు రోజుల పాటు జరిగే ఈ వేడుకకు రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర, ఒడిశా నుంచి భక్తులు ప్రతియేటా భారీ సంఖ్యలో వస్తున్న విషయం తెలిసిందే. ఈసారి కూడా భక్తులు భారీ సంఖ్యలో వస్తున్నారు . ఇప్పటి వరకు నిర్మానుష్యంగా అడవిలో జన జాతర ప్రారంభమైంది. అయితే, ఇదే అదనుగా వ్యాపారాలు అన్నింటికీ ఒక్కసారిగా రేట్లు పెంచేశారు . జాతర పరిసరాల్లో నిత్యావసరాల నుంచి బస చేసే గదుల వరకు అన్నిటి ధరలు ఆకాశాన్నంటడంతో సామాన్య భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
కోడి, మేకల ధరలు డబుల్ ..
జాతరలో అమ్మవార్లకు మొక్కుగా బెల్లం(బంగారం)తో పాటు కోళ్లు, మేకలను సమర్పించుకోవడం ఆదివాసీయుల ఆనవాయితీ. దీన్నే అదునుగా చేసుకున్న వ్యాపారులు ధరలను డబుల్ చేసేశారు. సాధారణంగా రోజుల్లో మేక, గొర్రె లైవ్ కిలో రూ. 420 ఉండేది. కానీ ఇప్పుడు మేడారంలో రూ. 900 నుంచి రూ. 1000 వరకు విక్రయిస్తున్నారు. ఇక, మటన్ ధర రూ. 750 ఉండేది ఏకంగా రూ. 1500కు పెంచేశారు. బ్రాయిలర్ కోడి బయట మార్కెట్‌లో కిలో రూ. 170-180 ఉండేది ఇక్కడ రూ. 300 నుంచి రూ. 350కి అమ్ముతున్నారు. నాటుకోడి ధర రూ. 350 ఉండేది రూ.700 పెగా అమ్ముతున్నారు. జాతర చివరి రోజుల్లో ఈ ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని భక్తులు ఆందోళన చెందుతున్నారు.
ఆకాశాన్నంటిన గదుల అద్దెలు
జాతరలో ఉండేందుకు తీసుకునే గదుల అద్దెలు కూడా చుక్కలు చూపిస్తున్నాయి. కనీస సౌకర్యాలు లేని చిన్న గదులకు సైతం రోజుకు రూ. 6,000 వరకు వసూలు చేస్తున్నారంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. కేవలం ఒక్క ఫ్యాన్ మాత్రమే ఉన్న గదికి వేలకు వేలకు వేలు చెల్లించాల్సి వస్తోంది.
చెట్ల కింద నీడకు సైతం అద్దె వసూల్
ఇక ఇళ్లు, గదులు దొరకని వారు సేద తీరేందుకు ఆరుబయట చెట్ల నీడను ఆశ్రయిస్తుంటే, అక్కడ కూడా దోపిడీ తప్పడం లేదు. జాతర పరిసరాల్లోని స్థలాల యజమానులు చెట్ల కింద నీడను సైతం అద్దెకు ఇస్తున్నారు. వంట చేసుకుని, భోజనం చేయడానికి ఒక చెట్టు కింద నీడ కోసం రూ. 1000 వరకు వసూలు చేస్తున్నారు. దూర ప్రాంతాల నుంచి వచ్చే వారు తప్పనిసరి పరిస్థితుల్లో నిత్యావసరాల సరుకులు స్థానికంగానే కొనుగోలు చేయాల్సి రావడంతో, వ్యాపారులు ఈ విధంగా ధరలు పెంచి సొమ్ము చేసుకుంటున్నారు. ఈ దోపిడీని అరికట్టేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని భక్తులు కోరుతున్నారు.











