తెలంగాణ రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. జగిత్యాల మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి టి. జీవన్ రెడ్డి శుక్రవారం నాడు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ను ఎర్రవెల్లిలోని ఫామ్ హౌస్‌లో కలిశారు. ఎర్రవెల్లికి చేరుకున్న జీవన్ రెడ్డికి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రులు కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్, ప్రశాంత్ రెడ్డి, ఇతర ముఖ్య నేతలు ఘనస్వాగతం పలికారు.

అనంతరం అయన కేసీఆర్ ను కలిశారు. జీవన్ రెడ్డిని సాదరంగా ఆహ్వానించి, ఆలింగనం చేసుకుని, శాలువాతో సన్మానించారు. ఈ సందర్భంగా జీవన్ రెడ్డితో పాటు ఆయన కుమారులు, జగిత్యాల జడ్పీ మాజీ చైర్ పర్సన్ వసంత సురేశ్ దంపతులు కూడా ఆయనతో పాటు ఉన్నారు.

కేసీఆర్‌ను చూడగానే జీవన్ రెడ్డి ఒక్కసారిగా భావోద్వేగానికి లోనయ్యారు. “అన్నా.. నన్ను దేవుడే మీ దగ్గరికి పంపాడు, మీతో కలిసి పనిచేయమని కోరాడు” అంటూ తన మనసులోని మాటను పంచుకున్నారు. తెలంగాణకు నష్టం జరుగుతున్న ప్రస్తుత తరుణంలో కేసీఆర్ నాయకత్వంలో పనిచేయాల్సిన అవసరం ఉందని జీవన్ రెడ్డి ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు.











