వన్డే ప్రపంచకప్ 2027 టోర్నమెంట్‌కు ఇంకా ఏడాదికి పైగా సమయం ఉన్నప్పటికీ, బీసీసీఐ ఇప్పటినుంచే పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతోంది. ఈ మెగా టోర్నీ కోసం సుమారు 20 మంది ఆటగాళ్లతో కూడిన ప్రాబబుల్స్ జాబితాను సెలక్టర్లు సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఐపీఎల్ 2026 సీజన్‌లో ఈ ఆటగాళ్ల ప్రదర్శనను నిశితంగా గమనించాలని సెలక్షన్ కమిటీ నిర్ణయించింది. సెలక్టర్లు ప్రధానంగా జస్‌ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, అర్ష్‌దీప్ సింగ్‌లతో పాటు ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా వంటి ఆటగాళ్లపై దృష్టి సారించనున్నారు.
మోకాలి గాయం నుంచి కోలుకుంటున్న హర్షిత్ రాణాకు మరికొంత సమయం పట్టే అవకాశం ఉంది.సెలెక్షన్ కమిటీ సభ్యులు ఎస్ఎస్ దాస్, ఆర్పీ సింగ్, అజయ్ రాత్రా, ప్రగ్యాన్ ఓఝా.. ఐపీఎల్ 2026 మ్యాచ్‌లను ప్రత్యక్షంగా స్టేడియాల్లోనూ, టీవీల్లోనూ పర్యవేక్షించనున్నారు. ప్రతీ వారం కనీసం ఐదు మ్యాచ్‌లను కవర్ చేసేలా, ఒక్కో సెలక్టర్ ఒక్కో మ్యాచ్‌కు హాజరయ్యేలా ప్రణాళిక రచించినట్లు బీసీసీఐ వర్గాలు తెలిపాయి. ఈ పర్యవేక్షణ కేవలం వన్డే ప్రపంచకప్‌ను దృష్టిలో ఉంచుకొని మాత్రమే జరుగుతుందని పీటీఐ ఒక కథనంలో పేర్కొంది.











