తెలంగాణ ప్రజల సంక్షేమమే ధ్యేయంగా సీఎం రేవంత్ రెడ్డి సారథ్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం మరో చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి కొండంత అండగా నిలిచేలా రూ. 5 లక్షల భారీ జీవిత బీమా పథకాన్ని ప్రభుత్వం ప్రకటించింది. ఈ పథకం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా సుమారు కోటి 15 లక్షల కుటుంబాలకు నేరుగా లబ్ధి చేకూరనుంది.
సీఎం రేవంత్ రెడ్డి ఈరోజు మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ … ఈ పథకం అమలుపై స్పష్టతనిచ్చారు. రాష్ట్రంలో రేషన్ కార్డు ఉన్న ప్రతి కుటుంబానికి ఈ బీమా సౌకర్యం వర్తిస్తుందని సీఎం ప్రకటించారు. తెలంగాణలో పుట్టడం, తెలంగాణలో జీవించడం ఒక అదృష్టం గా అనుకునేలా తమ ప్రభుత్వం పని చేస్తుందని, ఆయన ధీమా వ్యక్తం చేశారు. తమ ప్రభుత్వం కేవలం మాటలకే పరిమితం కాకుండా, సామాన్యుడి జీవితానికి భద్రత కల్పించడమే తమ లక్ష్యమని రేవంత్ రెడ్డి వివరించారు.
పేద, మధ్యతరగతి అనే తేడా లేకుండా అందరికీ వర్తించేలా ఇంత భారీ స్థాయిలో జీవిత బీమా కల్పిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని ప్రభుత్వం గర్వంగా చెబుతోంది. సామాజిక అంతరాలు లేకుండా ప్రతి పౌరుడికి భద్రత కల్పించే ఇలాంటి మహత్తర పథకం ప్రపంచంలో మరెక్కడా లేదని మంత్రి భట్టి పేర్కొన్నారు.
ఈరోజు జరిగిన బడ్జెట్ ప్రసంగంలో ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క ఈ ‘ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా’ పథకం వివరాలను వెల్లడించారు. ఈ పథకం 2026, జూన్ 2వ తేదీ (తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం) నుంచి అధికారికంగా అమల్లోకి రానుంది. కుటుంబంలో సంపాదించే వ్యక్తి అకస్మాత్తుగా మరణిస్తే, ఆ కుటుంబం ఆర్థికంగా చితికిపోకుండా ఈ ఐదు లక్షల రూపాయల బీమా సొమ్ము ఆదుకుంటుందన్నారు.











