విడుదల తేదీ : మార్చి 19, 2026
నటీనటులు : రణవీర్ సింగ్, సంజయ్ దత్, R. మాధవన్, అర్జున్ రాంపాల్, సారా అర్జున్
దర్శకుడు : ఆదిత్య ధర్
నిర్మాతలు : ఆదిత్య ధర్, జ్యోతి దేశ్‌పాండే, లోకేష్ ధర్
సంగీత దర్శకుడు : శాశ్వత్ సచ్దేవ్
సినిమాటోగ్రాఫర్ : వికాష్ నౌలాఖా
ఎడిటర్ : శివకుమార్ వి. పనికర్
ఇంట్రో :-
రణ్ వీర్ సింగ్ మరియు ఆదిత్య ధర్ కాంబినేషన్లో వచ్చిన ‘ధురంధర్’ వచ్చేనాటికి ఆ సినిమాపై ఎలాంటి అంచనాలూ లేవు. కానీ ఆ సినిమా బాలీవుడ్ లో దాదాపు రూ.1400 వందల కోట్లు కొల్లగొట్టింది. రెండు నెలల పాటు దేశవ్యాప్తంగా థియేటర్లను హోరెత్తించింది. దాంతో ‘దురంధర్ 2’పై భారీగా అంచనాలు పెరిగిపోయాయి. పార్ట్-1 లాగే మెప్పించిందా? ఈ కథను ఆదిత్య ఎలా ముందుకు తీసుకెళ్లాడు? ఎలా ముగించాడు? అనేది మన సమీక్షలో తెలుసుకుందాం . ..
కథ :-
ఈ కథ ఓరకంగా సర్జికల్ స్ట్రయిక్ లాంటిది. భారత్ ని దెబ్బకొట్టడానికి పాకిస్థాన్ చేసే వ్యూహాలు తెలుసుకొని, అక్కడి వ్యవస్థల్ని నాశనం చేయడానికి ఓ సీక్రెట్ ఏజెంట్ శత్రు దేశంలో అడుగుపెడితే ఎలా ఉంటుందన్న ఆలోచనకు ప్రతిరూపం. హంజా అలీగా పేరు మార్చుకుని పాకిస్థాన్‌లో స్థిరపడ్డ ఇండియన్ ఏజెంట్ హంజా అలీ మజారీ అలియాస్ జస్కీరత్ సింగ్ రంగీ (రణ్వీర్ సింగ్), ఆ దేశ రాజకీయాల్లో ఎంతో కీలకం అయిన ల్యారీ సిటీలో జెండా పాతుతాడు. ల్యారీని ఏలుతున్న రెహమాన్ దైకైత్ (అక్షయ్ ఖన్నా) ను మట్టుబెట్టి నెమ్మదిగా ఆ సిటీ మీద పట్టు సాధిస్తాడు. ఈ క్రమంలో ఒక్కో అడ్డు తొలగించుకుంటూ ముందుకు సాగుతాడు.
ప్లస్ పాయింట్స్ :-
ఇండియాలో జరిగిన ఉగ్ర దాడులకు తన సినిమాలోని కొన్ని సన్నివేశాలకు, కొన్ని పాత్రలకు ముడి పెట్టుకొని, వాటిని రివీల్ చేసి, వాళ్లపై రివైంజ్ తీర్చుకొన్న విధానం ఇండియన్స్ కు బాగా నచ్చింది. నోట్ల రద్దు ఎందుకు జరిగి ఉంటుంది? అనేదానికి దర్శకుడు ఈ సినిమాలో జస్టిఫికేషన్ చేశాడు. మోదీ రిఫరెన్సులు చాలా ఉంటాయి. మోదీ పేరెత్తినప్పుడల్లా, లేదంటే ఆయన ఫొటోని చూపించినప్పుడల్లా థియేటర్ లో అభిమానుల అరుపులతో మారుమ్రోగుతుంది. మాధవన్ నోటి నుంచి ‘భారత్ మాతాకీ జై’ అనే మాట వినిపించినప్పుడు మరోసారి థియేటర్ కి పూనకం వస్తుంది.
ఇక ‘దురంధర్-2’ నిడివి ఏకంగా నాలుగ్గంటలు. ‘దురంధర్’ ఎంత పెద్ద హిట్టయి ఉండనీ.. ఇంతసేపు థియేటర్లలో ప్రేక్షకులను కూర్చోబెట్టడం అన్నది సవాలే. ‘దురంధర్’ సినిమా నచ్చి, మధ్యలో ఆగిన కథను పూర్తిగా చూద్దాం అన్న ఆసక్తితో వచ్చిన ప్రేక్షకులకు ‘దురంధర్-2’ సినిమాలో ఒక్క నిమిషం కూడా బోర్ కొట్టదు. ఇంత పెద్ద నిడివి ఉన్నసినిమాని నాలుగ్గంటలు కూర్చుని చూశాక కూడా ఏమాత్రం విసుగురాకపోగా.. రోలింగ్ టైటిల్స్ పడుతున్నపుడు థియేటర్ల నుంచి కదలబుద్ధి కాకుండా స్క్రీన్ వైపు అతుక్కుపోతామంటే అది ఎంతగా ప్రేక్షకులను ఇన్వాల్వ్ చేస్తుందో అర్థం చేసుకోవచ్చు.
మైనస్ పాయింట్స్ :-
క్లైమాక్స్ లో ఏం జరగబోతోందో మనకు ఈజీగానే అర్థం అయిపోతుంది. అలాంటప్పుడు సినిమాని వీలైనంత త్వరగా ముగిస్తే బాగుండేది. కానీ కొన్ని సీన్లు కొంచెం సాగదీసినట్లు అనిపిస్తాయి. ముఖ్యంగా విలన్ ని అంతమొందించే ఘట్టం చాలా రొటీన్ గా తీశాడు. అలాగే కొన్ని రాజకీయ అంశాలు నేరుగా ఉండటం, ముఖ్యంగా “ఆపరేషన్ గ్రీన్ లీఫ్” ఎపిసోడ్ చర్చలకు దారితీసే అవకాశం ఉంది. శాశ్వత్ సచిదేవ్ అందించిన సంగీతం బాగున్నప్పటికీ, పాటలు మొదటి భాగం అనుకున్నంత స్థాయిలో లేవు.
సాంకేతిక విభాగం :-
టెక్నికల్ గా ‘దురంధర్-2’ ఇంటర్నేషనల్ లెవెల్లో ఉంది. నటీనటుల విషయానికొస్తే.. ఎవ్వరి పాత్రకి తగ్గట్టుగా వారు (జీవించారు) బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. దర్శకుడు పేపర్ పై రాసుకొన్న ప్రతీ సీన్‌కీ నటీనటులు ప్రాణం పోసేంత ఎఫెక్ట్ తీసుకొచ్చారు. రణవీర్ కి కెరీర్లో బెస్ట్ సినిమా అనే చెప్పాలి. ప్రతీ సీన్లో తను మమేకం అయిపోయాడు. మాధవన్ లుక్ గురించి పార్ట్ 1లో మాట్లాడేసుకొన్నారు. ఈసారి కొన్ని చిన్న చిన్న ఎక్స్‌ప్రెషెన్స్, డైలాగ్ మాడ్యులేషన్స్ లో తన మార్క్ చూపించాడు. మొత్తంగా విజువల్స్ కట్టిపడేస్తాయి. ప్రొడక్షన్ డిజైన్ అద్భుతంగా ఉంది. నిజంగా పాకిస్థాన్‌లోనే ఉన్న భావన కలిగేలా ల్యారీ సిటీని క్రియేట్ చేసిన తీరు అమోఘం. నిర్మాణ విలువలకు ఢోకా లేదు.
తీర్పు :-
రణవీర్ సింగ్ విశ్వరూపం, ఆదిత్య ధర్ విజన్ ఈ సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లాయి. ఈ చిత్ర ప్రభావం ఇండియన్ సినిమా మీద చాలా కాలం ఉంటుందనడంలో సందేహం లేదు.
aptsbreakingnews.com : Rating: 4/5
Reviewed by : Banna Prabhakar











