తెలంగాణ రాజధాని హైదరాబాద్ లో అంతర్జాతీయ స్థాయిలో కొత్త బస్‌స్టేషన్ నిర్మాణం చేపట్టబోతున్నారు. శంషాబాద్ విమానాశ్రయానికి సమీపంలో 150 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించేందుకు ఆర్టీసీ వడివడిగా అడుగులు వేస్తోంది. దీని నిర్మాణానికి గాను బహదూర్‌గూడ గ్రామం లో ప్రభుత్వ స్థలాన్ని గుర్తించాలని రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌కు లేఖ రాసింది. స్థల సేకరణ పూర్తయిన వెంటనే టెండర్లను పిలువనున్నారు. ప్రయాణికులకు అనువుగా ఉండేలా అధునాతన మౌలిక సదుపాయాలతో ఇంటర్ స్టేట్ బస్ టెర్మినల్, ఎలక్ట్రిక్ బస్‌డిపో, ఛార్జింగ్ కేంద్రం, మల్టీలెవల్ పార్కింగ్ నిర్మాణం కోసం ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. జిల్లా బస్సులతోపాటు సిటీ బస్సుల కోసం ఎలక్ట్రిక్ బస్ డిపో, 33 కేవీ ఎలక్ట్రిక్ ఛార్జింగ్ స్టేషన్‌ను సిద్ధం చేయనున్నారు.
ప్రయాణికులు ఉండేందుకు విశాలమైన గదులు,ఏసీ లాంజ్‌లు, ఏర్పాటు చేయనున్నారు. ఈ బస్‌స్టేషన్ లో ఉచిత వైఫై సేవలు ఉండనున్నాయి. మహిళలు, పిల్లలకు ప్రత్యేక జోన్లు బేబీ కేర్ గదులు ఉంటాయి. దివ్యాంగులకు ప్రత్యేక టాయిలెట్స్, వేయిటింగ్ రూమ్‌లు ఏర్పాటు చేయనున్నారు. ప్రయాణికులు సామాను భాదపరచుకునేందుకు లగేజ్ స్టోర్ అందుబాటులో ఉండనున్నాయి. బస్సులు వచ్చేవి, వెళ్ళేవి సమయాల సమాచారం కోసం యాప్ ఇంటిగ్రేషన్ చేయనున్నారు.
అలాగే నగరం నలువైపులా ఓఆర్‌ఆర్ సమీపంలో త్వరలో 12 చోట్ల బస్‌టెర్మినళ్ల నిర్మాణం చేపట్టేందుకు స్థల సేకరణ చేయనున్నారు. ఎలక్ట్రిక్ బస్సులు మాత్రమే సిటీ సర్వీసులుగా తిరిగేలా ఏర్పాట్లు చేస్తున్నారు. రాష్ట్రంలోని జిల్లాలతోపాటు, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే ఆర్టీసీ బస్సులను ఓఆర్‌ఆర్ అవతలే నిలిపివేయనున్నారు. అక్కడి నుంచి ప్రయాణికులు ఎలక్ట్రిక్ బస్సుల్లో నగరానికి చేరుకోవాల్సి ఉంటుంది. ఇక హైస్పీడ్ రైళ్లకు సంబంధించి శంషాబాద్‌లో భారీ టెర్మినల్ నిర్మించనున్నారు. దీన్ని మెట్రో రైలుతో అనుసంధానిస్తారు.











