Get Latest Business, Political, Bollywood, Cricket, videos, photos, live news
Email: aptsbreakingnews@gmail.com

ఎన్టీఆర్, శ్రీదేవిల అభిమాన నిర్మాతగా అర్జునరాజు ఇక లేరు . ..

తెలుగు చలనచిత్ర పరిశ్రమలో స్వర్ణయుగపు నిర్మాతల్లో ఒకరిగా పేరుగాంచిన ఎం. అర్జునరాజు (87) శుక్రవారం హైదరాబాద్‌లో కన్నుమూశారు. కొంతకాలంగా వృద్ధాప్య సంబంధిత అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన, శ్రీనగర్ కాలనీలోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. అయన మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు. అర్జునరాజు అంత్యక్రియలు ఈరోజు (శనివారం) మధ్యాహ్నం జూబ్లీహిల్స్‌లోని మహాప్రస్థానంలో జరగనున్నాయి. ఆయన మృతి పట్ల తెలుగు ఫిల్మ్ ఛాంబర్, నిర్మాతల మండలి సంతాపం ప్రకటించాయి.

రోజా మూవీస్ పతాకంపై కె. శివరామరాజుతో కలిసి అర్జునరాజు ఎన్నో విజయవంతమైన చిత్రాలను నిర్మించారు. ఆరోజుల్లో ఎన్టీఆర్, శ్రీదేవిల అభిమాన నిర్మాతగా అర్జునరాజుకు పేరుండేది. శ్రీదేవి కాల్‌షీట్లు కావాలంటే చాలామంది ఆయన్నే సంప్రదించేవారని చెబుతారు. ముఖ్యంగా నందమూరి తారక రామారావుతో ఆయనకు ప్రత్యేక అనుబంధం ఉంది. ఎన్టీఆర్ హీరోగా ఆయన నిర్మించిన ‘వేటగాడు’, ‘కొండవీటి సింహం’ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాలు సాధించాయి.

ఎన్టీఆర్‌తో పాటు కృష్ణ, కృష్ణంరాజులతో ‘అడవి సింహాలు’, శోభన్‌బాబుతో ‘కోడెత్రాచు’, చిరంజీవితో ‘జేబుదొంగ’, నాగార్జునతో ‘బావనచ్చాడు’ వంటి చిత్రాలను ఆయన నిర్మించారు. తెలుగులోనే కాకుండా హిందీలోనూ జితేంద్ర, ధర్మేంద్ర వంటి స్టార్లతో ఆరు చిత్రాలు నిర్మించి అక్కడ కూడా తనదైన ముద్ర వేశారు. రామోజీ ఫిల్మ్‌సిటీలో తొలి సినిమా చిత్రీకరణ చేసి చరిత్రలో నిలిచిపోయారు. శ్రీకాంత్ హీరోగా ఈవీవీ సత్యనారాయణ దర్శకత్వంలో వచ్చిన ‘మా నాన్నకు పెళ్లి’ చిత్రం రామోజీ ఫిల్మ్‌సిటీలో చిత్రీకరణ జరుపుకున్న తొలి సినిమాగా చరిత్రలో నిలిచిపోయింది.

RSS
Follow by Email
Latest news