ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఈరోజు ఉదయం 10.30 గంటలకు రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరగనుంది. అమరావతికి రాజధాని హోదా కల్పిస్తూ పార్లమెంట్లో చట్టం చేసినందుకు కేంద్ర ప్రభుత్వానికి, ప్రధానికి ధన్యవాదాలు తెలుపుతూ కేబినెట్ తీర్మానం చేసే అవకాశం ఉంది. ఏపీ సచివాలయంలో జరగనున్న ఈ భేటీలో రాజధాని అమరావతి నిర్మాణం, రాష్ట్రానికి పెట్టుబడులు, పారిశ్రామిక ప్రగతి సహా పలు కీలక అంశాలపై చర్చించనున్నారు. కేబినెట్ భేటీ ముగిసిన అనంతరం, మంత్రులతో చంద్రబాబు రాజకీయ అంశాలపై ప్రత్యేకంగా చర్చించనున్నట్లు తెలుస్తోంది. తాజా రాజకీయ పరిణామాలు, ప్రభుత్వ రెండేళ్ల పాలనపై ప్రజల్లోకి వెళ్లాల్సిన వ్యూహంపై ఆయన దిశానిర్దేశం చేయనున్నట్లు సమాచారం.
రాష్ట్రంలో పారిశ్రామిక ప్రగతికి ఊతమిచ్చేలా సుమారు రూ.39,436 కోట్ల విలువైన పెట్టుబడులకు కేబినెట్ ఆమోదం తెలవనున్నట్లు సమాచారం. రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి (ఎస్ఐపీబీ) గతంలో అనుమతి ఇచ్చిన 31 ప్రాజెక్టులకు కేబినెట్ లాంఛనంగా ఆమోదముద్ర వేయనుంది. వీటితో పాటు, విద్యా రంగంలో ఫీజుల నియంత్రణ కోసం ఫీజు రెగ్యులేటరీ కమిటీ (ఎఫ్ఆర్సీ) ఏర్పాటుకు ఆర్డినెన్స్ జారీ చేసి, ఆమోదం తెలిపే అవకాశం ఉంది. అమరావతిలో ఏర్పాటు చేయనున్న ‘క్వాంటమ్ వ్యాలీ’లో మూడు సంస్థల స్థాపనపై కూడా మంత్రివర్గం నిర్ణయం తీసుకోనుంది. రాజధాని అమరావతి నిర్మాణం, వివిధ సంస్థలకు భూముల కేటాయింపులపై కూడా సమావేశంలో సమగ్రంగా చర్చించనున్నారు. పరిపాలనా సౌలభ్యం కోసం 28 జిల్లాలకు కొత్త జోనల్ వ్యవస్థను ఖరారు చేసే అంశం కూడా ఎజెండాలో ఉంది.











