భారత విశిష్ట ప్రాధికార సంస్థ (UIDAI) ఆధార్ కార్డు వినియోగదారులకు శుభవార్త తెలిపింది. సరికొత్త ఫీచర్లతో కూడిన కొత్త ఆధార్ యాప్ పూర్తి వెర్షన్‌ను బుధవారం అందుబాటులోకి తెచ్చింది. ఆధార్ సేవలను మరింత సులభతరం చేస్తూ ఈ యాప్ ద్వారా పౌరులు ఇకపై ఇంటి నుంచే ఈ సేవలు పొందవచ్చు. ఆధార్ కేంద్రాలకు లేకుండానే కీలకమైన మార్పులు చేసుకునే సౌకర్యాన్ని కల్పించారు.
గతంలో ఉన్న mAadhaar యాప్ కంటే ఈ కొత్త యాప్ ఎన్నో ఆధునిక ఫీచర్లను అందిస్తోంది. వాస్తవానికి ఈ యాప్‌ను 2025 నవంబర్‌లో పరిచయం చేసినా, ఇప్పటివరకు పరిమిత సేవలు మాత్రమే అందుబాటులో ఉండేవి. తాజాగా పూర్తిస్థాయి వెర్షన్‌ను విడుదల చేయడంతో మొబైల్ నంబర్, ఇంటి చిరునామా వంటి వివరాలను ఇంటి నుంచే అప్డేట్ చేసుకోవచ్చు. యాప్‌లోని ప్రొఫైల్ సెక్షన్లో ఒకేసారి తమ కుటుంబ సభ్యులకు చెందిన 5 ఆధార్ కార్డులను యాడ్ చేసుకునే వీలును కల్పించారు.











