‘కడుపున మోయకున్నా.. గుండెల్లో దాచుకుని పెంచుకుంటున్నాం.. పేగుబంధం కాకున్నా కంటిపాపలా చూసుకున్నాం.. దయచేసి మా బిడ్డను తీసుకెళ్లొద్దు’ అంటూ దంపతులు ఓ వైపు. ఏడాది నుంచి రెండేళ్లుగా వారి ఆలనాపాలనలో పెరిగిన పిల్లల ఏడుపులు మరోవైపు. నేరేడ్‌మెట్‌లోని రాచకొండ పోలీసు కమిషనరేట్ కార్యాలయ ప్రాంగణంలో కనిపించిన ఈ దృశ్యాలు చూపరులను కంటతడి పెట్టించాయి.
నిందితుల నుంచి అక్రమ పద్ధతిలో పిల్లల్ని కొన్న 16 మందిని గుర్తించిన పోలీసులు ఆయా చిన్నారులతో సహా వారిని కార్యాలయానికి రప్పించారు. అనంతరం శిశువిహార్‌కు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తుండగా ఇన్నాళ్లూ వారిని పెంచిన మహిళలు ఒక్కసారిగా కన్నీటిపర్యంతమయ్యారు. చిన్నారులు సైతం పోలీసుల దగ్గరకు వెళ్లకుండా మహిళలను గట్టిగా హత్తుకొని మారాం చేశారు. ఎట్టకేలకు 16 మందిని తీసుకొని వాహనంలో తీసుకెళ్తుండగా కొందరు దంపతులు అడ్డుగా నిలబడ్డారు.
సంతానం లేదన్న బాధలో తెలిసో, తెలియకో పిల్లల్ని కొనుగోలు చేశామని.. ఏళ్ల తరబడి పెంచుకున్నాక దూరం చేస్తే ఎలా బతికేదంటూ కొందరు రోడ్డుపైనే కూలబడి గుండెలవిసేలా రోదించారు. ఈ 16 మందిలో 12 మంది ఆడపిల్లలు, నలుగురు మగపిల్లలు ఉన్నారు. తమ పిల్లల్ని తమకి ఇవ్వాలంటూ రాచకొండ కమిషనరేట్ కార్యాలయం వద్ద పిల్లలను పెంచుకున్న తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు.