- ఏపీలో ఎమర్జెన్సీని మించిన దారుణ పరిస్థితులు…
- జీవో నెంబర్ 1 ద్వారా ప్రతిపక్షాల నియంత్రణ అప్రజాస్వామ్యం…
- ప్రజాస్వామ్య పరిరక్షణకు రాజకీయ పక్షాలు, ప్రజా సంఘాలతో కలిసి ఉద్యమం…
- టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఉమ్మడి ప్రకటన…
- కుప్పంలో చంద్రబాబు పర్యటనను అడ్డుకోవడాన్ని ఖండించిన పవన్ కల్యాణ్…
- చంద్రబాబు నివాసానికి వెళ్లి సంఘీభావం తెలిపిన జనసేన అధినేత పవన్…
హైదరాబాద్ లోని చంద్రబాబు నాయుడు నివాసంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ భేటీ అయ్యారు. ఉదయం 11.30 గంటలకు చంద్రబాబు నివాసానికి వచ్చిన పవన్ కల్యాణ్ రెండున్నర గంటలకు పైగా వివిధ అంశాలపై చర్చించారు. తాజా గా ఏపీ ప్రభుత్వం తెచ్చిన జీవో నెంబర్ 1 ద్వారా కుప్పంలో చంద్రబాబు పర్యటనను అడ్డుకోవడాన్ని పవన్ తప్పు పట్టారు. ఈ ఘటనపై తెలుగు దేశం అధినేత చంద్రబాబుకు జనసేన అధ్యక్షుడు పవన్ సంఘీభావం ప్రకటించారు.
అనంతరం ఇద్దరు నేతలు కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. ఏపీలో ఎమర్జెన్సీని మంచి ఆరాచక పాలన సాగుతుందని టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు అన్నారు. జీవో నెంబర్ 1 ద్వారా ప్రతిపక్షాల, ప్రజా సంఘాల గొంతు నొక్కే ప్రయత్నం జరుగుతుందని ఆయన మండిపడ్డారు. దీనిపై రాజకీయ పక్షాలు, ప్రజా సంఘాలతో కలిసి ప్రజా స్వామ్య పరిరక్షణ ఉద్యమం చేపడతామని ప్రకటించారు. నేడు రాష్ట్రంలో ఎమర్జెన్సీ కంటే భయంకరమైన పరిస్థితులు ఉన్నాయని వీటిపై పోరాడుతామని చంద్రబాబు తెలిపారు.
సిఎం, వైసిపి నేతలు మీటింగ్ లు, సమావేశాలు పెట్టుకోవచ్చు…కానీ ప్రతిపక్షాలు పెట్టుకోకూడదు అంటున్నారు. కందుకూరు, గుంటూరు ఘటన వెనుక ప్రభుత్వ కుట్ర ఉంది….ఆ సభలకు బందోబస్తు ఎందుకు పెట్టలేదు. సభలు, మీటింగ్ లు జరుగుతున్నప్పుడు బందోబస్తు ఇవ్వాల్సిన బాద్యత పోలీసులది కాదా అని చంద్రబాబు ప్రశ్నించారు. ప్రభుత్వ నిరంకుశ విధానాలపై ప్రజాస్వామ్య పరిరక్షణ పేరుతో పోరాటం చేస్తాం. నల్ల చట్టాలపై ప్రజా పోరాటం, న్యాయ పోరాటం కూడా చేస్తామని బాబు తెలిపారు.
జగన్ ప్రభుత్వం ఇటీవల తీసుకు వచ్చిన జీవో నెంబర్ 1 ద్వారా కుప్పంలో చంద్రబాబు పర్యటనను అడ్డుకోవడాన్ని పవన్ కళ్యాణ్ తప్పు పట్టారు. ప్రతిపక్షాలను ప్రజల్లో తిరగనివ్వడం లేదు అని ప్రభుత్వంపై మండిపడ్డారు. రాబోయే ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతో చెత్త జీవోలను తెస్తున్నారన్నని విమర్శించారు. విశాఖ పర్యటనలో భాగంగా నాపై ఆంక్షలు పెట్టారు. ఇప్పుడు సీనియర్ నేత చంద్రబాబు పర్యటనను అడ్డుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ అరాచకాలను అడ్డుకునేందుకు బీజేపీతో కూడా సంప్రదిస్తానని పవన్ కల్యాణ్ తెలిపారు.